ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC/APSFT&TDC) చైర్మన్ శ్రీ పి. భరత్ భూషణ్, ఎండీ కె. విశ్వనాథన్ లు నంది అవార్డులకు సంబంధించిన అంశాలపై సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని శనివారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మొదటి అంతస్తులోని ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ… గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టేందుకు చర్యలు చేపడుతోందన్నారు.
అదే విధంగా 2017 నుంచి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను కూడా అందించనున్నట్లు నిర్ణయించారన్నారు. నంది ఫిల్మ్ మరియు జాతీయ చలనచిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వేదికగా అందించాలని నిర్ణయించారన్నారు. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించాలని నిర్ణయించారన్నారు. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026 లోగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
=========================